kcr: ఆ పథకం గురించి కేసీఆర్ కు చెబితే ‘మంచి ఆలోచన తమ్మీ’ అని ప్రశంసించారు: మంత్రి ఈటల
- నేను చిన్నతనంలో సైదాబాద్ హాస్టల్లో ఉన్నాను
- ముక్కిపోయిన బియ్యంతో వండిన అన్నంలో పురుగులు ఉండేవి
- బీసీ హాస్టల్ లోనూ అదే పరిస్థితి ఉండేది
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు సన్న బియ్యం పంపిణీ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం గురించిన ఆలోచన చేసింది మంత్రి ఈటల రాజేందర్ అనే వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అసలు విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై ఈటలను ప్రశ్నించగా..తాను చిన్నతనంలో సైదాబాద్ హాస్టల్లో ఉన్నానని, ముక్కిపోయన బియ్యంతో వండిన అన్నంలో పురుగులు కూడా ఉండేవని గుర్తుచేసుకున్నారు. బీసీ హాస్టల్ లో చేరినప్పటికీ అవే సమస్యలు ఉండేవని, అప్పట్లో, ఈ విషయమై పోరాడామని అన్నారు.
తాను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు అప్పటి సీఎం చెన్నారెడ్డి సభలో గొడవ చేశామని, పోలీస్ కంట్రోల్ రూమ్ కు తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై, తమ పోరాటం కొనసాగిందని, పీడీఎస్ యూ తరపున జూన్, జులై మాసాల్లో ఉద్యమించేవాళ్లమని నాటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు సన్నబియ్యం పథకం అవసరమని సీఎం కేసీఆర్ కు చెప్పానని అన్నారు. ‘మంచి ఆలోచన తమ్మీ’ అంటూ ప్రోత్సహించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా వుండటం తమ అదృష్టమని ఈటల అన్నారు.