nd tiwari: ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి కన్నుమూత.. ఈరోజే ఆయన పుట్టినరోజు కూడా!
- ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన తివారీ
- ఆయన వయసు 93 సంవత్సరాలు
- రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని చేసిన తివారీ
సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి కన్నుమూశారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఆయన వయసు 93 సంవత్సరాలు. ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన ఆయనను గత ఏడాది సెప్టెంబరులో ఆసుపత్రిలో చేర్పించారు. జూలైలో ఆయన శరీరంలోని పలు అవయవాలు పాడయ్యాయి (మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్). ఈ నేపథ్యంలో, బీపీ లెవెల్స్ తీవ్ర స్థాయిలో పడిపోవడంతో ఆయన పరిస్థితి విషమించింది. దీంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. వైద్యానికి ఆయన శరీరం సహకరించకపోవడంతో కాసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తివారీ మూడు పర్యాయాలు పని చేశారు. ఒకసారి ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా పని చేశారు. 2007 ఆగస్టు 22 నుంచి 2009 డిసెంబర్ 26 వరకు ఏపీ గవర్నర్ గా వ్యవహరించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ పదవిని ఆయన కోల్పోయారు. ఆయన స్థానంలో నరసింహన్ గవర్నర్ గా వచ్చారు.