china: చైనాకు అత్యంత సమీపంలో ప్రయాణించిన అమెరికా బాంబర్లు
- దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవులకు సమీపంలో వెళ్లిన బాంబర్లు
- ఆ దీవులపై మాకు సార్వభౌమాధికారం ఉందన్న చైనా
- 2004 నుంచి ఈ ప్రాంతంలో తమ బాంబర్లు వెళ్లున్నాయన్న అమెరికా
చైనా భూభాగానికి అత్యంత సమీపంలో అమెరికాకు చెందిన న్యూక్లియర్ బాంబర్లు ప్రయాణించాయి. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవులకు అత్యంత సమీపం నుంచి ఇవి వెళ్లాయి. గువామ్ లోని వాయుసేన స్థావరం నుంచి బయల్దేరిన బి-52 స్ట్రాటో ఫోర్ ట్రెస్ బాంబర్లు ప్రయాణించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ ఘటనపై చైనా విదేశాంగ శాఖ ఆచితూచి స్పందించింది. ఈ దీవులపై చైనాకు సార్వభౌమాధికారం ఉందని తెలిపింది. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని... అమెరికా నేవిగేషన్ తో తమకు ఇబ్బంది లేదని చెప్పింది. దీనిపై అమెరికా స్పందిస్తూ 2004 నుంచి ఈ ప్రాంతంలో తమ బాంబర్లు ప్రయాణిస్తూనే ఉన్నాయని తెలిపింది. సింగపూర్ లో జరగనున్న రీజనల్ సెక్యూరిటీ సదస్సులో అమెరికా-చైనా రక్షణ మంత్రులు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశం అయింది.