Hyderabad: చెరువును తలపిస్తున్న హైదరాబాద్‌లోని మిథిలానగర్ కాలనీ
- రెండు రోజులైనా ఎక్కడి నీరు అక్కడే
- వర్షం నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు
- బతుకమ్మ పండుగకు కూడా దూరమైన కాలనీ వాసులు
హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్ పరిధిలో ఉన్న మిథిలానగర్ కాలనీ ప్రస్తుతం చెరువును తలపిస్తోంది. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కాలనీ జలమయమైంది. నీరు పోయే మార్గం లేక ఎక్కడిదక్కడే నిలిచి పోవడంతో, ప్రస్తుతం కాలనీ వాసులు చెరువులో నివాసం ఉన్నట్టుగా వుంది.
జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఎక్కడ రోగాలు ముసురుకుంటాయోనని భయపడుతున్నారు. రెండు దశాబ్దాలుగా తమ పరిస్థితి ఇలాగే ఉన్నా పట్టించుకున్న వారు లేరని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షానికే కాలనీ పరిస్థితి ఇలా తయారైతే ఇక భారీ వర్షాలు రోజుల తరబడి కురిస్తే తమ పరిస్థితి ఏమిటో ఒక్కసారి జీహెచ్‌ఎంసీ అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి ముంగిట పెద్ద ఎత్తున నీరు నిలిచి పోవడంతో తెలంగాణలో అత్యంత ముఖ్యమైన బతుకమ్మ పండుగకు కూడా కాలనీ వాసులు ఈ ఏడాది దూరమయ్యారు.