Congress: కాంగ్రెస్‌లోకి ఆర్.కృష్ణయ్య.. ఎమ్మెల్సీ పదవి ఆఫర్?
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి
- ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపిన కాంగ్రెస్ నేతలు
- త్వరలోనే చెబుతానన్న బీసీ నేత
తెలంగాణ టీడీపీ నేత, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవితోపాటు తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే మంచి ప్రాధాన్యం ఉన్న మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున సీఎం అభ్యర్థిగా కృష్ణయ్య బరిలోకి దిగి గెలిచారు. అయితే, ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి దూరం జరిగారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఎల్‌బీనగర్ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియాలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో సెటిలర్లతోపాటు బీసీ ఓటు బ్యాంకుపైనా దృష్టి సారించిన కాంగ్రెస్ కృష్ణయ్యను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా లబ్ధి పొందాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఆఫర్‌పై కృష్ణయ్య స్పందిస్తూ బీసీ సంఘాలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కృష్ణయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమే!