PUnjab: సెల్ఫీ పిచ్చే ప్రాణాలు తీసిందా?.. రైలు ప్రమాద సమయంలో సెల్ఫీల కోసం పోటీపడిన ప్రజలు!
- రైలు ప్రమాదంలో 60కి చేరిన మృతుల సంఖ్య
- సెల్ఫీల మోజులో రైలు రాకను గుర్తించని వైనం
- సాయం మానేసి క్షతగాత్రులతో ఫొటోలు
శుక్రవారం సాయంత్రం పంజాబ్లోని జోడా పాఠక్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోడానికి సెల్ఫీల పిచ్చే కారణమని తెలుస్తోంది. సెల్ఫీల కోసం ప్రజలు పోటీలు పడి రైలు రాకను గమనించకపోవడంతో ప్రాణనష్టం భారీగా ఉందని చెబుతున్నారు. ఇక్కడ మరో ఘోరమైన విషయం ఏంటంటే.. రైలు ఢీకొడుతున్న దృశ్యాలను కూడా సెల్ ఫోన్లలో బంధించడం. అంతేకాదు, ఆ దృశ్యాలను చిత్రీకరించలేకపోయిన వారు, అవి తీసిన వారి నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవడం గమనార్హం.
ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయి ఆర్తనాదాలు చేస్తున్న వారికి సాయం అందించాల్సింది పోయి వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం మరింత బాధాకరమని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడంపై దిగ్భ్రాంతికి లోనైనట్టు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రీతిశర్మ మీనన్ మాట్లాడుతూ.. రైలు ప్రజలపై నుంచి వెళ్తుంటే దానిని కూడా కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.