anil ambani: మీడియా సంస్థలను టార్గెట్ చేసిన అనిల్ అంబానీ కంపెనీలు.. వేల కోట్లకు పరువు నష్టం దావాలు!
- రాఫెల్ డీల్‌పై వార్తలతో తమ ప్రతిష్ట దిగజార్చారంటూ సంస్థలకు నోటీసులు
- ఎన్డీటీవీపైనే రూ.10 వేల కోట్లకు దావా
- ఫెమా చట్టం కింద ఈడీ నుంచి మరో నోటీసు
రాఫెల్ రగడ జాతీయ స్థాయి చర్చనీయాంశం కావడంతో అనిల్ అంబానీ సంస్థలు మీడియా కంపెనీలు, ప్రతినిధులపై పరువు నష్టం కేసులతో శరసంధానం చేస్తున్నాయి. ఏకంగా 15 జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మీడియా కంపెనీలపై రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ ఏరో స్ట్రక్చర్ అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో కేసులు దాఖలు చేశాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి తాము అనుచిత లబ్ధి పొందామన్నట్లు ప్రజల్ని భ్రమింపజేసేలా సదరు సంస్థల కథనాలు ఉన్నాయంటూ తమ నోటీసుల్లో ఆరోపించాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్విపై రూ.5 వేల కోట్లకు దావా వేసిన ఈ సంస్థలు ఎన్డీటీవీ చానల్‌పై ఏకంగా రూ.10వేల కోట్లకు పరువు నష్టం కేసు వేశాయి. ఈ సంస్థపై ఈ నెల 11న దావా వేయగా ఈ నెల 26వ తేదీన ఇది విచారణకు రానుంది.
అయితే, చానల్లో చర్చకు రావాలని, మీ వివరణ తెలపాని తాము ఎన్నోసార్లు రిలయన్స్ ఉన్నతాధికారులను కోరామని, వారే స్పందించలేదని ఎన్డీటీవీ పేర్కొంది. మీడియాను బెదిరించి నిరోధించడానికి, వాస్తవాలను తొక్కిపట్టడానికి అనిల్ అంబానీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. మరోవైపు ఎన్డీటీవీకి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఈడీ మరో నోటీసు జారీ చేసింది. రూ.3 వేల కోట్లకు ఉల్లంఘనకు ప్పాడినట్లు నోటీసుల్లో పేర్కొంది.