Amrutasar: తప్పంతా ప్రజలదే... విచారణ లేదు, డ్రైవర్ పై చర్యలు ఉండవు: అమృతసర్ ప్రమాదంపై రైల్వే శాఖ
- 91 కి.మీ వేగాన్ని 68 కి.మీ.కు తగ్గించాడు
- ఇంకా బ్రేక్ వేసుంటే పెను ప్రమాదం జరిగేది
- స్పష్టం చేసిన రైల్వే శాఖ
పంజాబ్, అమృతసర్ లోని జాడా పాటక్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తప్పంతా ప్రజలదేనని, వారే అక్రమంగా పట్టాలపైకి ప్రవేశించారని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ ఘటనపై రైల్వే శాఖ ఎటువంటి విచారణను జరిపించబోవడం లేదని, రైలు డ్రైవర్ పైనా చర్యలేవీ వుండవని ఆ శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.
పట్టాలపై మనుషులను చూసిన వెంటనే డ్రైవర్.. అప్పటికే గంటకు 91 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలు వేగాన్ని 68 కిలోమీటర్లకు తగ్గించాడని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన చోట ఎటువంటి లెవల్ క్రాసింగ్ లేదని, ప్రజలే పట్టాలపైకి వచ్చారని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని తెలిపారు. రైలుకు బ్రేకులేసి ఆపే ప్రయత్నం చేసుంటే, మరింత పెద్ద ప్రమాదం జరిగివుండేదని అన్నారు.
ఇదే సమయంలో ప్రమాదంపై అమృతసర్ కార్పొరేషన్ కమిషనర్ సోనాలి స్పందిస్తూ, జోడా పాటక్ వద్ద దసరా వేడుకలు నిర్వహించుకునేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని, తమను ఎవరూ అనుమతి కోరలేదని చెప్పారు.