Lakshmi's NTR: ఎన్టీఆర్ స్వర్గంలో కాకుంటే ఇంకెక్కడ ఉంటారు?: రామ్ గోపాల్ వర్మ
- సినిమా ఆపాలంటే స్వర్గంలోని ఆయన దిగిరావాల్సిందే
- ఎన్టీఆర్ స్వర్గంలో ఉన్నట్టు దేవుడే చెప్పాడు
- తన సినిమాకు కథే కథానాయకుడన్న వర్మ
తాను నిర్మించతలచిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఆపాలంటే స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ దిగిరావాల్సిందేనని, మరెవరు విమర్శలు చేసినా, నిరసనలకు దిగినా, ఈ సినిమా ఆగదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఒకరు చెబితే మనసు మార్చుకునే గుణం ఎన్టీఆర్ కు ఉందని తాను అనుకోవడం లేదని, ఎవరి మాటనూ వినరన్న పేరున్న ఆయన, తన పాలన వ్యవహారాల్లో లక్ష్మీ పార్వతి సలహాలు తీసుకుని ఉంటారని అనుకోవడం లేదని అన్నారు. ఒకవేళ అలా తీసుకుని ఉంటే, అప్పుడు రామారావు ఆలోచన ఏమైనట్టు? తప్పు ఆయనదా? లేక ఈమెదా? అన్న కోణంలో తన ఆలోచనలు సాగాయని, ఇదే సినిమాలో తన సెంటర్ పాయింటని చెప్పారు.
తన చిత్రంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత ఉన్న పాత్రలన్నీ ఉంటాయని, ఆయన కుమారుల ప్రస్తావన అవసరార్థం ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ వంటి వ్యక్తి స్వర్గానికి వెళ్లకుంటే, మరెవరు వెళ్తారని ప్రశ్నించిన రామ్ గోపాల్ వర్మ, ఆయన స్వర్గంలో ఉన్నారన్న విషయాన్ని దేవుడే చెప్పాడని వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు కథే కథానాయకుడని, రాజకీయాల్లో పెను మార్పులకు కారణమైన వ్యక్తి జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను తాను చూపించనున్నానని అన్నారు.