ongole: ప్రత్యేక యూనివర్సిటీగా రూపుదిద్దుకోనున్న ఒంగోలులోని నాగార్జున పీజీ సెంటర్‌

  • ఉన్నత విద్యామండలి ప్రతిపాదన
  • అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు 

నాగార్జున యూనివర్సిటీకి అనుబంధంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న పీజీ సెంటర్‌ త్వరలో ప్రత్యేక యూనివర్సిటీగా రూపుదిద్దుకోనుంది. ఈ పీజీ సెంటర్‌ను ప్రత్యేక యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ఉన్నత విద్యా మండలి తాజా ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపకల్పనలో అధికార యంత్రాంగం నిమగ్నమవుతోంది.

పీజీ సెంటర్‌ను రాష్ట్ర విశ్వవిద్యాయంగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన బిల్లు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగితే, ఇప్పటి వరకు ఒక్క యూనివర్సిటీ కూడా లేని ప్రకాశం జిల్లాకు వర్సిటీ హోదా దక్కుతుంది. ప్రస్తుతం సెలవులో ఉన్న ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సోమవారం నుంచి విధుల్లోకి రానున్నారు. ఆ తర్వాత వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైలుకు కదలిక వస్తుంది.

ఒంగోలు పీజీ సెంటర్‌కు వర్సిటీకి ఉండాల్సిన అన్ని హంగులు ఉన్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఎస్‌.విజయరాజు, వైస్‌ చైర్మన్‌ పెమ్మసాని నరసింహారావు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి ఇషారాయ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆమె స్పందిస్తూ తక్షణం వర్సిటీ అప్‌గ్రేడేషన్‌కు ప్రతిపాదనలు పంపించాలని, రాష్ట్రీయ ఉచ్చతార్‌ శిక్షా అభియాన్‌ (రూసా) పథకం కింద మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలోనే ఉన్నత విద్యా మండలి వర్సిటీ ఏర్పాటు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఒంగోలులోని నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్‌ను 1993, నవంబరు 16న ప్రారంభించారు.  ఈ పీజీ సెంటర్‌ పరిధిలో ఒంగోలులో నాలుగు ఎకరాలు, పేర్నమిట్టలో 110 ఎకరాలు కలిపి మొత్తం 114 ఎకరాల భూమి ఉంది. అవసరమైన భవన సదుపాయం ఉంది. పీజీ సెంటర్‌కు అనుబంధంగా 300 కళాశాలలు నడుస్తున్నాయి. అందువల్ల పెద్ద ఆర్థిక ఇబ్బంది లేకుండా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News