Tirumala: తిరుమలపై పలు చోట్ల కనిపించిన చిరుత... రంగంలోకి దిగిన అధికారులు!
- నడకదారి, ఘాట్ రోడ్డులో కనిపించిన చిరుత
- బాలాజీనగర్ లో కూడా
- సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
- బంధిస్తామంటున్న టీటీడీ సిబ్బంది
తొలుత ఘాట్ రోడ్డులో, ఆపై నడకదారిలో, మరోసారి తిరుమలలోని బాలాజీ నగర్ లో, ఇంకోసారి శ్రీవారి పాదాల మార్గంలో... తిరుమలలో కనిపిస్తున్న చిరుతపులులు భక్తుల్లో తీవ్ర భయాందోళనలను రేపుతుండగా, అధికారులు రంగంలోకి దిగారు. ఈ చిరుత దృశ్యాలు పలు ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అడవుల నుంచి దారితప్పి వచ్చిన చిరుత తిరుమల చుట్టూ సంచరిస్తోందని అధికారులు చెబుతుండగా, ఒక చిరుతే కాదని, కొన్ని చిరుతలు వచ్చాయని, ఏదైనా ప్రమాదం జరుగకముందే అధికారులు కళ్లు తెరవాలని భక్తులు కోరుతున్నారు.
కాగా, కనీసం రెండు చిరుతలు తిరుమల పరిసరాల్లో తిరుగాడుతున్నాయని తెలుస్తోంది. ఒకదాని వయసు ఏడాదిన్నర, రెండోదాని వయసు 4 నుంచి 5 సంవత్సరాలు ఉండవచ్చని చెబుతున్న కొందరు, ఇవి జనావాసాలపైకి వస్తున్నాయని, రాత్రుళ్లు మిద్దెల మీద తిరుగాడుతున్నాయని అంటున్నారు. వీటిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇవి ఎక్కడున్నాయన్న విషయాన్ని కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని టీటీడీ పేర్కొంది.