Andhra Pradesh: కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామంటే అంగీకరించని చంద్రబాబు: కన్నా సంచలన విమర్శలు
- బీజేపీ ఆధ్వర్యంలో 'రాయలసీమ ప్రజా ఆవేదన ధర్నా'
- పాల్గొని ప్రసంగించిన కన్నా లక్ష్మీనారాయణ
- సీమ అభివృద్ధి కాగితాలకే పరిమితం
- సీమలో హైకోర్టుపై చంద్రబాబు వైఖరి ఏమిటి?
- ప్రశ్నించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు
కడపలో ఉక్కు ఫ్యాక్టరీని పెట్టేందుకు కేంద్రం తన పూర్తి సంసిద్ధతను తెలియజేస్తే, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఆ ప్రాంతంలో ప్లాంటు వద్దని అడ్డుకున్నది చంద్రబాబునాయుడేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన విమర్శలు చేశారు. ఈ ఉదయం అనంతపురంలో బీజేపీ ఆధ్వర్యంలో 'రాయలసీమ ప్రజా ఆవేదన ధర్నా' జరుగగా, కన్నా పాల్గొని ప్రసంగించారు.
చైనాకు చెందిన ఓ సంస్థతో కుమ్మక్కైన చంద్రబాబు, ప్లాంటుపై సరైన వివరాలను కేంద్రానికి అందించలేదని నిప్పులు చెరిగారు. అందువల్లే కడపకు స్టీల్ ప్లాంట్ రాలేదని, బీజేపీ ప్లాంటును ఇచ్చేందుకు ఇప్పటికీ కట్టుబడివుందని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు ద్రోహిగా మారారని, ఇక్కడి అభివృద్ధిని కాగితాలకే పరిమితం చేశారని ఆరోపించిన ఆయన, వెనుకబడిన ప్రాంతాల రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
సీమలో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ కట్టుబడివుందని, ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో చంద్రబాబు ఇంతవరకూ చెప్పలేదని విమర్శలు గుప్పించారు. ఓ పథకం ప్రకారం రాయలసీమలో ఉన్న పరిశ్రమలను మూసివేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.