KCR: వెళ్లండి.. అభ్యర్థులెవరూ హైదరాబాదులో కనపడవద్దు!: కేసీఆర్ హెచ్చరిక
- 10, 15 చోట్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి
- ప్రతిపక్షాల మేనిఫెస్టోను కాపీ కొట్టామనే విమర్శలను తిప్పి కొట్టండి
- నియోజకవర్గాల్లో ప్రచారాన్ని తీవ్రతరం చేయండి
ఇప్పటికే ప్రకటించిన 105 మంది అభ్యర్థులు, ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. 3 గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో అభ్యర్థులకు కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. ప్రతిపక్షాల మేనిఫెస్టోను కాపీ కొట్టామన్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు. 10, 15 చోట్ల ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ సర్వే రిపోర్టులను చూపించారు.
ప్రతి నియోజకవర్గంలోను అభ్యర్థుల బలాబలాలను ఆయన విడివిడిగా చర్చించారు. అభ్యర్థుల పరిస్థితిని సమీక్షించారు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులను ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ 40 రోజుల పాటు అభ్యర్థులెవరూ హైదరాబాదులో కనిపించడానికి వీల్లేదని, నియోజకవర్గాల్లో ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని హుకుం జారీ చేశారు.