Team India: తొలి వన్డేలో కదంతొక్కిన రోహిత్, కోహ్లీ.. విండీస్ చిత్తు!

  • చెలరేగిన విండీస్ బ్యాట్స్‌మెన్
  • 323 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా
  • కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

భారత్-విండీస్ మధ్య గువాహటిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ  సెంచరీలతో చెలరేగిపోయారు. వారిద్దరి దెబ్బకు భారీ లక్ష్యం కాస్తా చిన్నదైపోయింది. మరో 47 బంతులు మిగిలి ఉండగానే విజయం భారత్ చెంతకు చేరింది.

తొలుత  టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. భారత బౌలర్లు అడపాదడపా వికెట్లు తీస్తున్నా పరుగుల వేగం తగ్గకుండా విండీస్ బ్యాట్స్‌మెన్ జాగ్రత్త పడ్డారు. విండీస్ యువ బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మయర్ 78 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. 13 వన్డేల్లో అతడికిది మూడో సెంచరీ కావడం గమనార్హం. ఓపెనర్ కీరన్ పావెల్ 51, షాయ్ హోప్ 32, రోవ్‌మన్ పావెల్ 22, కెప్టెన్ జాసన్ హోల్డర్ 38, దేవేంద్ర బిషూ 22, కెమార్ రోచ్ 26 పరుగులు చేశారు. దీంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి భారత్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు పడగొట్టగా, షమీ, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఖలీల్ అహ్మద్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం 323 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఓవర్ చివరి బంతికే ఓపెనర్ శిఖర్ ధవన్ (4) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడికి రోహిత్ శర్మ పూర్తి సహకారం అందించాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొత్తం 107 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 140 పరుగులు చేసి ఔటయ్యాడు.

కెప్టెన్ అవుటయ్యాక రోహిత్ రెచ్చిపోయాడు. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 117 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 152 పరుగులు చేశాడు. కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (22)తో కలిసి రోహిత్  పని పూర్తి చేశాడు. 42.1 ఓవర్లలోనే భారత్‌కు విజయం అందించిపెట్టాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది. సెంచరీతో చెలరేగిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రెండో వన్డే ఈ నెల 24న విశాఖపట్టణంలో జరగనుంది.

  • Loading...

More Telugu News