Men Too: ఇప్పుడు పురుషుల వంతు.. బెంగళూరు కేంద్రంగా ‘మెన్ టూ’ ఉద్యమం!
- మహిళల చేతిలో అన్యాయానికి గురైన వారి కోసం ‘మెన్ టూ’
- ‘మీటూ’కు వ్యతిరేకం కాదన్న జాగిర్దార్
- వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్
ప్రస్తుతం దేశంలో ‘మీటూ’ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. వివిధ రంగాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు. ఇప్పుడు ఇటువంటి తరహా ఉద్యమమే మరోటి పురుడు పోసుకుంది. అయితే, ఇది పురుషుల చేతిలో అన్యాయానికి గురైన మహిళలకు సంబంధించినది కాదు.. మహిళల చేతిలో కష్టాలు పడుతున్న పురుషులకు సంబంధించింది. దీనిపేరు ‘మెన్ టూ’ (పురుషులు కూడా).
బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘క్రిస్ప్’ అనే స్పచ్ఛంద సంస్థ దీనిని తెరపైకి తీసుకొచ్చింది. ఈ సంస్థ నిర్వాహకుడైన కుమార్ జాగిర్దార్.. మరో 15 మందితో కలిసి ఆదివారం దీనిని ప్రారంభించారు. ‘మీటూ’కు ‘మెన్ టూ’ ఏమాత్రం వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా జాగిర్దార్ పేర్కొన్నారు. తప్పుడు కేసులు, ఆరోపణలతో మానసిక క్షోభ అనుభవిస్తున్న పురుషుల ఆవేదనను వెలికి తీసుకొచ్చేందుకే దీనిని ప్రారంభించినట్టు వివరించారు. అకౌంటెంట్ అయిన జాగిర్దార్... స్టాక్ మార్కెట్ నిపుణుడు కూడా. భార్యా బాధితుల సంఘం, భారతీయ కుటుంబ సంక్షేమ సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాలలో సవరణలు చేయాలంటూ గత 15 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఆయనను వదిలి కుమార్తెతో కలిసి వెళ్లిపోయిన భార్య ఓ క్రికెటర్‌ను పెళ్లాడింది. తన కుమార్తె సంరక్షణ భారాన్ని తనకు అప్పగించాలంటూ పోరాడి విజయం సాధించారు.
కాగా, ‘మెన్ టూ’ వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ మజురియర్ ఉండడం విశేషం. సొంత కుమార్తెనే లైంగికంగా వేధించాడంటూ పాస్కల్‌పై ఆయన భార్య కేసు పెట్టింది. 2017లో కేసును కొట్టేసిన కోర్టు పాస్కల్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.