Jayalalitha: జయలలిత అంత్యక్రియలకు కోటి రూపాయలు ఖర్చు చేసిన తమిళనాడు ప్రభుత్వం.. వెలుగు చూసిన నిజం!
- ఆర్టీఐ చట్టం ద్వారా పలు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం
- జయ డిసెంబరు 5నే చనిపోయారని స్పష్టీకరణ
- అపోలోలో చికిత్సకు రూపాయి కూడా ఖర్చు చేయలేదన్న ప్రభుత్వం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? సమాచార హక్కు చట్టంలో భాగంగా ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం బదులిచ్చింది. డిసెంబరు 2016లో జరిగిన జయ అంత్యక్రియలకు ఏకంగా రూ.99.33 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం జయలలిత మృతిపై దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జయలలిత మృతికి సంబంధించిన వివరాలు కావాల్సిందిగా కోరుతూ మధురైకి చెందిన సయ్యద్ తమీమ్ ఆర్టీఐకి పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి.. జయలలిత అంత్యక్రియల కోసం 99.33 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసినట్టు సమాధానమిచ్చారు. అలాగే, అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్సకు ఎంత ఖర్చు చేశారన్న మరో ప్రశ్నకు ప్రభుత్వం బదులిస్తూ ఆమె చికిత్స కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని పేర్కొనడం గమనార్హం.
జయలలిత డిసెంబరు 5 కంటే ముందే చనిపోయారని వార్తలు వచ్చాయని, నిజానికి ఆమె ఎప్పుడు చనిపోయారో చెప్పాలన్న ప్రశ్నకు.. ఆమె డిసెంబరు 5నే చనిపోయారని స్పష్టం చేశారు. జయలలిత ఎమ్మెల్యే పెన్షన్ను ఎవరు పొందుతున్నారన్న ప్రశ్నకు అసెంబ్లీ సెక్రటరీని అడిగి తెలుసుకోవాల్సిందిగా పిటిషన్దారుడిని కోరారు.