Sabarimala: శబరిమలలో నేడు మహా ర్యాలీ... హింసకు అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరిక!
- నేడు మూతబడనున్న అయ్యప్ప ఆలయం
- ర్యాలీలో హింస తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు
- పథనంతిట్ట జిల్లాలో 144 సెక్షన్
శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అతివలను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్న శివసేన తదితర హిందూ సంఘాలు, నేడు మహార్యాలీని నిర్వహించనుండగా, ఈ ర్యాలీ సందర్భంగా హింస తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నేడు శబరిమల ఆలయ ద్వారాలు మాస పూజల అనంతరం రాత్రి 10 గంటలకు మూసివేయనున్న సంగతి తెలిసిందే. తిరిగి నవంబర్ మూడోవారంలో ఆలయ తలుపులు మండల పూజ కోసం తెరచుకోనున్నాయి.
నిఘా వర్గాల నుంచి అందిన హెచ్చరికలతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం శబరిమల, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. పథనంతిట్ట జిల్లాలో 144 సెక్షన్ విధించింది. మహార్యాలీని విజయవంతం చేస్తామని హిందూ సంఘాలు స్పష్టం చేస్తుండగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.