Uttar Pradesh: వికటించిన కట్నం డిమాండ్.. చావగొట్టి శిరోముండనం చేసిన వధువు తల్లిదండ్రులు!

  • ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘటన
  • పెళ్లిపీటలపై కట్నం డిమాండ్ చేసిన వరుడు
  • పోలీసులకు అప్పగించిన వధువు తల్లిదండ్రులు

కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు అడగకుండానే పెళ్లిలో కట్నకానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. మరికొందరేమో ముందుగానే అలాంటివి తమకు పడవని స్పష్టం చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అబ్బాయి తరఫువారు అడ్డం తిరగడంతో సమస్యలు మొదలవుతాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కట్నం కింద బైక్, బంగారు గొలుసు ఇవ్వకుంటే పెళ్లి చేసుకోబోనని పెళ్లి మండపం దగ్గర ఓ యువకుడు అడ్డం తిరిగాడు. ముందుగా కట్నం లేకుండా వివాహానికి ఒప్పుకుని, ఇప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడటంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు

తిక్కరేగిన వధువు తల్లిదండ్రులు కాళ్లు, చేతులు కట్టేసి చావగొట్టారు. అంతటితో ఆగక శిరోముండనం చేశారు. ఇక్కడి బహ్రెయిచ్ జిల్లాకు చెందిన అబ్దుల్లా కమాల్ కు లక్నోలోని ఖుర్రం నగర్ కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో బంధుమిత్రులతో కలిసి లక్నోలోని షాదీ మహల్ కు చేరుకున్న అబ్దుల్లా కమాల్.. కట్నం కింద బైక్, బంగారు గొలుసు కావాలని డిమాండ్ చేశాడు. లేదంటే పెళ్లి పీటలు ఎక్కబోనని స్పష్టం చేశాడు. కట్నం ఇవ్వబోమని ముందే చెప్పినా అల్లుడు మరోసారి మొండిపట్టు పట్టడంతో వధువు తరఫు బంధువులు రెచ్చిపోయారు.

ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అబ్దుల్లాను ఓ పిల్లర్ కు కట్టేసి చావగొట్టారు. అక్కడితో ఆగకుండా శిరోముండనం చేయించారు. అనంతరం పెళ్లిని రద్దు చేసుకుని, సదరు ప్రబుద్ధుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News