Telangana: తెలంగాణ ప్రభుత్వ పథకాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రశంసల జల్లు!
- రైతు బంధు, మిషన్ కాకతీయ అద్భుత ఫథకాలు
- రైతుల కోసం పనిచేసే అవకాశాన్ని నాకు ఇవ్వలేదు
- అందుకే ఐపీఎస్ సర్వీసుకు రాజీనామా చేశా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాయని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం కోసం మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను తవ్వించిందని ప్రశంసించారు.
వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వడం అభివృద్ధికి కీలకమనీ, సాగు రంగం బాగుపడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని లక్ష్మీ నారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించనందువల్లే ఏడేళ్ల ముందుగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని తెలిపారు. సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తాననీ, ఇప్పుడు తన రాజకీయ అరంగ్రేటంపై జరగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు.