ram madhav: గోబెల్స్ కే గురువు చంద్రబాబు: రాంమాధవ్
- అగ్రిగోల్డ్ ఆస్తులను కొనేందుకు వచ్చిన సంస్థను వెనక్కి పంపించేశారు
- అవినీతిలో ఏపీ నాలుగవ స్థానంలో ఉంది
- ఏపీలో త్రిపుర ఫార్ములాను అమలు చేస్తాం
అగ్రిగోల్డ్ బాధితుల పట్ల టీడీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడటానికి ప్రభుత్వ వైఖరే కారణమని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనడానికి ముందుకు వచ్చిన ఎస్ఎల్ గ్రూపును ప్రభుత్వం వెనక్కి పంపిందని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా నేటి నుంచి ఐదు రోజుల పాలు బీజేపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
గతంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రశంసించిన చంద్రబాబు... ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్నారని రాంమాధవ్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీ లేకపోతే టీడీపీ గల్లంతయ్యేదని అన్నారు. గోబెల్స్ కు కూడా చంద్రబాబు గురువులాంటి వాడని ఎద్దేవా చేశారు. దేశంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉందని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ లు రెండూ ఒకే తాను ముక్కలని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిపుర ఫార్ములాను అమలు చేస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని అన్నారు.