Pawan Kalyan: పచ్చటి ఉద్ధానం బీడు భూమిగా మారింది.. సహాయక చర్యలకు ఇబ్బంది రాకూడదనే తొలుత వెళ్లలేదు!: పవన్ కల్యాణ్
- తిత్లీతో శ్రీకాకుళం తీవ్రంగా దెబ్బతింది
- ఒడిశాను తాకుతుందని మేమంతా అనుకున్నాం
- విధ్వంసాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేందుకే పర్యటించా
తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా దెబ్బతిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పచ్చటి కొబ్బరి చెట్లతో ఉండే ఉద్ధానం ఇప్పుడు బీడు భూమిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలకు కోనసీమ ఎలాంటిదో.. శ్రీకాకుళం జిల్లాకు ఉద్ధానం ప్రాంతం అలాంటిదని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రతిఏటా మూడు పంటలు పండుతాయన్నారు. శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్.. ఈరోజు విజయవాడలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిత్లీ తుపాను ప్రభావం ఒడిశా పైనే ఉంటుందని తామంతా అనుకున్నామని తెలిపారు. సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదనే తిత్లీ వచ్చిన వెంటనే శ్రీకాకుళం వెళ్లకుండా ఆగిపోయానన్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారనీ, ఇది ఎంతమాత్రం సరికాదన్నారు. తిత్లీ విధ్వంసాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్న లక్ష్యంతోనే తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించానని పవన్ అన్నారు. శ్రీకాకుళం తిత్లీ బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని పవన్ కోరారు.