aravinda sametha: 'అరవింద సమేత' సినిమాను నిషేధించండి: బీజేపీ
- రాయలసీమ ప్రజలను అవమానించేలా సినిమా ఉంది
- టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ
- మేకిన్ ఇండియాలో భాగంగానే కియా ఫ్యాక్టరీ వచ్చింది
జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. రూ. 150 కోట్లు వసూలు చేసే దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నిషేధం విధించాలని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను అవమానించేలా సినిమా ఉందని ఆయన అన్నారు.
ఇదే సమయంలో టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని అభివర్ణించారు. రాయలసీమలో హైకోర్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ కూడా మేకిన్ ఇండియాలో భాగంగానే వచ్చిందని చెప్పారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని టీడీపీ నేతల మేలు కోసమే చేపడుతున్నారని... చైనా కంపెనీతో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు.