Telangana: సీట్ల విషయంలో సర్దుకుపోండి.. అధికారంలోకి రాగానే ప్రత్యామ్నాయ పదవులు ఇస్తాం!: టీటీడీపీ నేతలకు చంద్రబాబు హామీ
- టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
- కాంగ్రెస్ తో పొత్తు చాలా కీలకమని వ్యాఖ్య
- 18 సీట్లను కోరతానని సంకేతాలు
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో సీట్ల కంటే పొత్తు ముఖ్యమనీ, ఈ విషయంలో సర్దుకుపోవాలని టీటీడీపీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏర్పడే మహాకూటమి జాతీయ స్థాయి రాజకీయాల్లో పెను ప్రభావం చూపుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మహాకూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీకి 12 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందనీ, మరో 6 సీట్లను ఇవ్వాల్సిందిగా తాను కోరతానని చంద్రబాబు అన్నారు. మహాకూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం జరుగుతుందనీ, టికెట్లు దక్కని అభ్యర్థులకు ప్రత్యామ్నాయ పదవులు ఇచ్చి ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును టీటీడీపీ నేతలు కోరడంతో అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ భేటీ సందర్భంగా శేరిలింగంపల్లి స్థానాన్ని భవ్య సిమెంట్స్ ఆనందప్రసాద్కు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.