Uttam Kumar Reddy: టీఆర్ఎస్ కు వచ్చేవి 30 సీట్లే: మహాకూటమి
- నాగోల్ లో ఓ కార్యక్రమానికి హాజరైన మహాకూటమి నేతలు
- కేసీఆర్ నిరంకుశ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్న ఉత్తమ్
- పొత్తుతోనే ముందుకు వెళతామన్న కోదండరామ్
తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని మహాకూటమి నేతలు తెలిపారు. హైదరాబాద్ నాగోల్ లోని బండ్లగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధినేత కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, కేసీఆర్ నిరంకుశపాలనను తుదముట్టించేందుకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఆరు శాతం కమిషన్ ను కేసీఆర్ కుటుంబం తీసుకుంటోందని ఆరోపించారు. అధికారికంగానే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు.
ఎల్.రమణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ గ్రాఫ్ 60 సీట్ల నుంచి 30 సీట్లకు పడిపోయిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో సమాజహితం కొరవడిందని కోదండరామ్ విమర్శించారు. సీట్ల పంపకాలలో చిన్నపాటి విభేదాలు వచ్చినా, పొత్తుతోనే ముందుకు వెళతామని చెప్పారు. చాడ మాట్లాడుతూ, ఉద్యమంతో సంబంధం లేని వారికి కేసీఆర్ ప్రభుత్వంలో పదవులు దక్కాయని విమర్శించారు.