Andhra Pradesh: సాయంత్రం కల్లా శ్రీకాకుళం మెజారిటీ ప్రాంతాలకు కరెంట్ ఇస్తాం!: మంత్రి కళా వెంకట్రావు
- జిల్లాలో 33,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి
- వీటిలో 25 వేల స్తంభాలను పునరుద్ధరించాం
- రెండ్రోజుల్లోగా జిల్లా మొత్తం విద్యుత్ సరఫరా
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను ప్రభావంతో దాదాపు 33,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. తుపాను అనంతరం రాత్రీపగలు తేడా లేకుండా సహాయక చర్యలు చేపట్టామనీ, ఇప్పటివరకూ 25 వేల విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించామని వెల్లడించారు. ప్రధానంగా పంచాయితీలు, గ్రామాలకు ఈ రోజు సాయంత్రానికల్లా విద్యుత్ సరఫరాను మొదలుపెడతామని పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో జిల్లా మొత్తం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు.
ప్రస్తుతం 1,804 గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. తుపానును ఎదుర్కొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులు, టెక్నీషియన్లను తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షించడంతో నిర్ణీత గడువులోనే లక్షాన్ని చేరుకున్నామని మంత్రి తెలిపారు. మంచి నీటి సరఫరాకు ట్యాంకర్లు, జనరేటర్లను వాడామనీ, దీని ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.