sabarimala: శబరిమల వివాదంలో ట్విస్ట్.. రివ్యూ పిటిషన్లను వచ్చే నెల 13న విచారించనున్న సుప్రీంకోర్టు!
- విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం
- 10-50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై కేసు
- రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన హిందూ సంస్థలు
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 13 మధ్యాహ్నం 3 గంటలకు వీటిపై విచారణ చేపడతామని తెలిపింది.
కేరళలోని శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను అనుమతించరు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఐదుగురు జడ్జీల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఈ నిబంధనను కొట్టివేస్తూ 4:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ నిబంధనకు చట్టబద్ధత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో శబరిమలలో మహిళల ప్రవేశంపై సంప్రదాయవాదులు తీవ్ర ఆందోళనకు దిగారు.
పలు హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లేందుకు యత్నించిన మహిళల్ని అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ పలు హిందూ సంస్థలు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.