India: భారత్, పాకిస్థాన్ ల మధ్య నేడు కీలక చర్చలు
- ఫోన్ ద్వారా చర్చలు.. పాల్గొననున్న ఉన్నతాధికారులు
- పాక్ అనాగరిక చర్యలను ప్రశ్నించనున్న భారత అధికారులు
- ఆర్మీ పెట్రోల్ పార్టీపై ఇటీవల జరిగిన ఉగ్రవాదదాడి నేపథ్యంలో చర్చలకు ప్రాధాన్యత
దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ ల మధ్య ఈరోజు డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) స్థాయి చర్చలు జరగనున్నాయి. ఫోన్ ద్వారా జరగనున్న ఈ చర్చల్లో ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరగనున్న ఈ చర్చల్లో.. పాక్ వైఖరి పట్ల భారత్ తన నిరసనను వ్యక్తం చేయనుంది.
నియంత్రణ రేఖ వెంబడి ఇటీవలే బాట్ (బోర్డర్ యాక్షన్ టీం) సైనికులను హత్య చేయడాన్ని, ఉగ్రవాదుల చొరబాట్లను భారత అధికారులు ఖండించనున్నారు. పాక్ ఆర్మీ అనాగరిక చర్యలను ప్రశ్నించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో యథేచ్చగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను భారత అధికారులు ప్రశ్నించనున్నారని ఇండియన్ మిలిటరీకి చెందిన ఉన్నతాధికారి తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లోని సుందర్బన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ పెట్రోల్ పార్టీపై ఇటీవల జరిగిన దాడిలో ముగ్గురు సైనికులు, ఇద్దరు చొరబాటుదారులు మృతి చెందారు. పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి అనంతరం ఈ చర్చలు జరగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుండగా రెండు దేశాల ఆర్మీలకు చెందిన సెక్టార్ కమాండర్లు అక్టోబర్ 21న పూంచ్‌లో సమావేశమయ్యారు. ఉగ్రవాదులను దేశంలోకి పంపించడంపై భారత్ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.