India: షింజే అబేతో భేటీ కానున్న మోదీ.. కీలక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం
- వచ్చేవారం జపాన్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
- కీలకమైన ఎల్ఎస్ఏపై ఇరు దేశాల ప్రధానుల చర్చలు
- ఒప్పందం కుదిరితే అమెరికా తర్వాత దేశంగా నిలవనున్న జపాన్
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న భారత్ మరో కీలక ఒప్పందంవైపు అడుగులు వేస్తోంది. భారత్, జపాన్ మధ్య వచ్చేవారం కీలకమైన ఎల్ఎస్ఏ ఒప్పందం కుదరనుంది. వార్షిక సమావేశంలో భాగంగా వచ్చే వారం జపాన్ ప్రధాని షింజే అబేతో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమవనున్నారు. చర్చల అనంతరం భారత్, జపాన్ మధ్య లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్(ఎల్ఎస్ఏ) కుదరనుంది.
ఈ ఒప్పందం కుదిరితే ఇరుదేశాల సైన్యాలు ఒకరి భూభాగంపై మరొకరు తమ మిలిటరీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాదు, భారత్కు ఎల్ఎస్ఏ ఒప్పందం కలిగి ఉన్న రెండో దేశంగా జపాన్ నిలవనుంది. అగ్రరాజ్యం అమెరికాతో మాత్రమే భారత్కు ఎల్ఎస్ఏ ఒప్పందం ఉంది. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీ వచ్చిన జపాన్ ప్రతినిధి కెంజీ హిరమత్స్ వెల్లడించారు.
ఇరు దేశ ప్రధానుల మధ్య అక్టోబర్ 28, 29 తేదీల్లో టోక్యోలో సమావేశం జరగనుందని కెంజీ వెల్లడించారు. ఇరువురు ప్రధానుల మధ్య ఏసీఎస్ఏతోపాటు పరస్పర ఎల్ఎస్ఏ ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని, ఇరు దేశాలు ఇప్పటికే ఎన్నో మిలటరీ కవాతులు నిర్వహించాయని, ఒప్పందం సహజమైనదేనని, ఎల్ఎస్ఏను అమలు పరచొచ్చని కెంజీ హిరమత్స్ అభిప్రాయపడ్డారు.