amruthsar: అమృతసర్ రైలు విషాదం.. ‘వాట్సాప్’ ద్వారా భర్తకు వీడ్కోలు పలికిన భార్య!
- అమృతసర్ ఘటనలో బీహార్ వాసి మృతి
- మృతదేహం తరలించాలంటే రూ.45,000 ఖర్చు
- అంత ఆర్థిక స్తోమత లేని రాజేశ్ కుటుంబం
పంజాబ్ లోని అమృత్సర్ రైలు ప్రమాద ఘటనలో సుమారు అరవై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో బీహార్ కు చెందిన రాజేశ్ భగత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. రాజేశ్ మృతదేహం కోసం ఆయన కుటుంబసభ్యులు, భార్య ఎదురుచూస్తున్న సమయంలో సంబంధిత అధికారులు చెప్పిన మాటలు విని, పేద కుటుంబానికి చెందిన వారి నోట మాట రాలేదు.
రాజేశ్ మృతదేహాన్ని అతని స్వస్థలానికి తరలించాలంటే రూ.45,000 అవుతుందని అధికారులు చెప్పారు. పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబం.. ఇంతమొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలో అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియని రాజేశ్ భార్య చిట్టచివరకు ఓ నిర్ణయం తీసుకుంది. ‘వాట్సాప్’ ద్వారా తన భర్తకు తుది వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ లేదా బీహార్ ప్రభుత్వం తమపై దయ చూపి ఉంటే తన భర్త మృతదేహాన్ని చివరిసారి చూసుకునే దాన్నని కన్నీటి పర్యంతమయ్యారు.
కాగా, ప్రస్తుతం గర్భిణీ అయిన ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్ చనిపోవడంతో కుటుంబ బాధ్యత ఆమెపై పడింది. ఈ సంఘటనతో చలించిపోయిన గ్రామస్తులు రాజేశ్ భార్యకు ఆర్థికంగా కొంత మొత్తం సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తన కుటుంబ పోషణార్థం తనకు ఏదైనా మార్గం చూపించాలని సంబంధిత అధికారులకు రాజేశ్ భార్య విజ్ఞప్తి చేశారు.