CBI: రాత్రికి రాత్రే సీబీఐ డైరెక్టర్ ను మార్చేసిన ప్రభుత్వం... విజయరామారావు తరువాత మరో తెలుగు వ్యక్తికి అవకాశం!
- కొత్త డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావు
- ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్ గా విధుల్లో
- వరంగల్ జిల్లాకు చెందిన నాగేశ్వరరావు
ఆరోపణల్లో కూరుకుపోయిన సీబీఐని ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఏ మాత్రం ముందస్తు ఊహాగానాలు లేకుండా ప్రస్తుత డైరెక్టర్ అలోక్ వర్మను రాత్రికి రాత్రే మార్చారు. సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ గత అర్ధరాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయరామారావు తరువాత సీబీఐ డైరెక్టర్ గా నియమితుడైన మరో తెలుగు వ్యక్తి నాగేశ్వరరావే కావడం గమనార్హం.
సీబీఐలో ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు పదోన్నతి కల్పిస్తున్నట్టు నియామకాల విభాగం ప్రకటించింది. 1986 బ్యాచ్ కి చెందిన నాగేశ్వరరావు ఒడిశా కేడర్ లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన ఒడిశా డీజీపీగానూ పనిచేశారు. వరంగల్ జిల్లా బోర్ నర్సాపూర్ ఆయన స్వగ్రామం.