Hyderabad: చికిత్స అందించని వైద్యులపై ఓ తల్లి ఆగ్రహం!
- ప్రాణాపాయ స్థితిలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మండిపాటు
- ఓ పీజీ వైద్యుడి చెంప చెళ్ళుమనిపించిన బాధితురాలు
- హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఘటన
బిడ్డ ఆకలితో కెవ్వుమంటేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. వంద పనులున్నా పక్కన పెట్టి ఆ బిడ్డ ఆకలి తీరుస్తుంది. అటువంటిది కళ్లెదుటే కొడుకు ప్రాణాపాయంతో విలవిల్లాడుతుంటే తట్టుకోగలదా.. కాపాడండి బాబూ అని కనిపించిన ప్రతి వైద్యుడి కాళ్లావేళ్లాపడినా పట్టించుకోక పోవడంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
తప్పా...ఒప్పా అని చూడకుండా పీజీ వైద్యుడు చెంప చెళ్ళుమనిపించింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని కార్వాన్ జీరాకు చెందిన ఓ మహిళ కొడుక్కి సుస్తీ చేసింది. బిడ్డను తీసుకుని మంగళవారం నీలోఫర్ ఆస్పత్రికి వచ్చింది. బిడ్డ విలవిల్లాడిపోతున్నా చాలా సేపటి వరకు అతన్ని ఏ డాక్టరూ, సిబ్బంది పట్టించుకోలేదు. తన బిడ్డను బతికించాలని అక్కడి వైద్యులను వేడుకున్నా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
కొడుకు పరిస్థితి విషమంగా మారుతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి అక్కడ ఉన్న పీజీ వైద్యుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది. వారు కూడా పట్టించుకోక పోవడంతో ఆగ్రహం తట్టుకోలేక ఒక వైద్యుడి చెంప చెళ్ళుమనిపించింది. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడి వైద్యుల వంతయింది. కాగా ఈ వివాదం ఆస్పత్రి సూపరింటెండెంట్ వరకు వెళ్లింది.