Andhra Pradesh: మరో రికార్డు.. 3,200 కిలోమీటర్లు చేరుకున్న జగన్ ప్రజాసంకల్ప యాత్ర!
- విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత
- సాలూరు మండలం బాగువలస వద్ద 3,200 కి.మీకు చేరిక
- మరో వారం రోజుల్లో శ్రీకాకుళంలోకి
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈరోజు 3,200 కిలోమీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జగన్ 293వ రోజు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం సన్యాసిరాజు పేట నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించగా, సాలూరు మండలం బాగువలస వద్ద జగన్ యాత్ర 3,200 కి.మీ దాటింది.
విజయనగరం జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర మరో వారం రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు చేరనుంది. ఈరోజు సన్యాసిరాజు పేట నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర బాగువలస, నక్కడవలస క్రాస్, తడిలోవ, మక్కువ మండలం గునికొండ వలస మీదుగా చపచప బుచ్చంపేట వరకూ కొనసాగనుంది.
కాగా, 'తిత్లీ' తుఫాను బాధితులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రాలేదని అధికార పక్షం నేతలు విమర్శిస్తున్న వేళ, నిన్న ఓ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, తాను మరో వారంలో శ్రీకాకుళం జిల్లాకు వస్తాననీ, కనీసం 50 రోజుల పాటు అక్కడే ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే.