TTD: టీటీడీ చరిత్రలో తొలిసారి... మాజీ ప్రధానార్చకుడిపై రూ. 200 కోట్లకు పరువునష్టం దావా!
- రమణ దీక్షితులుపై దావా వేసిన టీటీడీ
- కోర్టు ఫీజుకింద రూ. 2 కోట్లు చెల్లింపు
- భక్తుల ధనం వృథా చేస్తున్నారన్న వైసీపీ
తిరుమల దేవాలయం మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ రూ. 200 కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసింది. టీటీడీ చరిత్రలో ఇలా మాజీ ప్రధానార్చకుడిపై పరువు నష్టం కేసు దాఖలు కావడం ఇదే తొలిసారి. దేవస్థానంలో మిరాశీ అర్చకులు, వంశపారంపర్య అర్చకుల పదవీ విరమణ వయసును నిర్దేశిస్తూ, టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న తరువాత, పలువురు తమ అర్చకత్వ పదవులకు దూరంకాగా, వారిలో రమణ దీక్షితులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆపై ఆయన టీటీడీ బోర్డుపైనా, అధికారుల తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.
స్వామివారి నగలు అన్యాక్రాంతం అవుతున్నాయని, కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను అధికారులు మాయం చేశారని ఆరోపించారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన నగలను కాజేశారని, ఆలయంలోని నేల మాళిగల్లో ఉన్న అపారమైన సంపదను కొల్లగొట్టేందుకు ఎవరికీ తెలియకుండా తవ్వకాలు జరిపించారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో పరమ పవిత్రమైన ఆలయం పరువు పోయిందని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, టీటీడీ ఈ దావాను వేసింది. పరువు నష్టం దావా కింద కోర్టు ఫీజుగా చెల్లించాల్సిన ఒక శాతం మొత్తం రూ. 2 కోట్లను చెల్లించింది టీటీడీ.
కాగా, టీటీడీ తన స్వప్రయోజనాల కోసం భక్తుల ధనాన్ని ఇలా కోర్టు ఫీజుల కింద వృథా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.