delivary in flight: విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
- అబుదాబీ నుంచి జకార్తా వెళ్తుండగా మార్గమధ్యలో ప్రసవం
- అత్యవసరంగా విమానాన్ని ముంబైకి మళ్లించిన పైలట్
- అంధేరిలోని ఈస్ట్సెవెన్ ఆస్పత్రికి తల్లీ బిడ్డల తరలింపు
దేశం కాని దేశంలో...అదీ ఆకాశయానం చేస్తుండగా ఆ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అబుదాబీ నుంచి జకార్తా వెళ్తుండగా విమానంలోనే ప్రసవం జరిగింది. దీంతో పైలట్ అత్యవసరంగా విమానాన్ని ముంబైకి మళ్లించాడు. వివరాల్లోకి వెళితే..ఇండోనేషియా దేశానికి చెందిన ఓ నిండు గర్భిణి జకర్తాకు వెళ్లడానికి ఈవై 474 నంబరుగల ఇతిహాద్ విమానాన్ని అబుదాబీలో ఎక్కింది.
మార్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. పరిస్థితిని తెలుసుకున్న పైలట్ విమానాన్ని అత్యవసరంగా ముంబై వైపు మళ్లించాడు. అయితే, విమానం ల్యాండ్ అయ్యేలోగానే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను అంధేరిలోని ఈస్ట్ సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలను మహిళా రోగుల విభాగానికి తరలించామని, వారు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.