Raghuveera Reddy: రాష్ట్రంలో జగన్ పార్టీ ఇంకా ఉందా?: రఘువీరారెడ్డి
- జగన్‌పై రఘువీరా తీవ్ర విమర్శలు
- అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలు, ఇంటి దగ్గర కూర్చున్న ఎంపీలు
- ప్రతిపక్షం ఇంతలా విఫలం కావడం ఇదే తొలిసారి
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్టణంలో బుధవారం ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఊమన్ చాందీతో కలిసి రఘువీరా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ పార్టీ వైఎస్సార్ సీపీ ఉందో, లేదో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళంలో అంత పెద్ద విధ్వంసం జరిగితే పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించలేకపోయారన్నారు. ప్రతిపక్షం ఇంతలా వైఫల్యం చెందడం చరిత్రలో ఇదే తొలిసారన్నారు.
ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లరని, ఎంపీలను గెలిపిస్తే వారు రాజీనామా చేసి ఇంటి దగ్గర కూర్చున్నారని రఘువీరారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. భవిష్యత్ కాంగ్రెస్‌దేనని రఘువీరారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.