Rafale Deal: రాఫెల్ కుంభకోణంపై సుప్రీంను ఆశ్రయించిన మాజీ మంత్రులు!
- కేసు నమోదు కోరుతూ సుప్రీంకోర్టులో పిల్
- ఈ నెల 4న అప్పటి సీబీఐ డైరెక్టర్‌ను కలిసినట్టు వివరణ
- 29లోగా వివరాలు అందజేయాలంటూ కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఈ విషయంలో కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ బుధవారం కేంద్ర మాజీ మంత్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు ఈ మేరకు బుధవారం అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
రాఫెల్ డీల్‌పై విచారణ చేపట్టాలంటూ ఈ నెల 4న అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను కలిసినట్టు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాల్లో నేరపూరిత దుష్ప్రవర్తన నెలకొందని ఆరోపించారు. ఇటువంటి ఫిర్యాదుల విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ‘లలిత కుమారి’ కేసులో రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరి ఫిర్యాదుపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ నెల 29లోగా వివరాలు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.