Uttar Pradesh: భారీ దోపిడీ.. యూపీలో ఆభరణాల దుకాణంలో రూ. 140 కోట్ల విలువైన నగల చోరీ!
- కాన్పూర్ లోని ఆభరణాల దుకాణంలో దొంగతనం
- ఐదేళ్ల క్రితం కోర్టు ఆదేశాలతో షాప్ సీజ్
- తిరిగి తెరిచే ప్రయత్నాల్లో ఉండగానే ఈ ఘటన
- సీరియస్ గా తీసుకున్న పోలీసులు
ఈ శతాబ్దంలోనే ఇండియాలో నమోదైన అతిపెద్ద దోపిడీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, బిర్హానా రోడ్డులో ఉన్న ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు రూ. 140 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించుకు వెళ్లారు. 10 వేల క్యారెట్ల విలువైన డైమండ్స్, 100 కిలోల బంగారం, 500 కిలోల వెండి, ఐదు వేల క్యారెట్ల విలువైన ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్టు సమాచారం. ఈ షాప్ ను యజమానుల మధ్య ఉన్న గొడవల కారణంగా ఐదేళ్ల క్రితం మూసివేయగా, ఇంత భారీ దొంగతనం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
షాపు యజమానులు వివాదంతో కోర్టుకు ఎక్కడంతో 2013లో జ్యూయెలరీ షాపును కోర్టు ఆదేశాలతో సీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కేసు పరిష్కారం కాగా, తిరిగి షాపును తెరచుకోవచ్చంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో మంచిరోజు చూసి షాపును తెరవాలని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఆభరణాలతో పాటు షాపుకు చెందిన కొన్ని కీలక దస్త్రాలను కూడా దొంగలు తీసుకెళ్లినట్టు పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, దొంగలను గుర్తించేందుకు అన్ని మార్గాల్లో అన్వేషణ సాగిస్తున్నామని తెలిపారు.