Paytm: పేటీఎం సీఈవో బ్లాక్‌మెయిల్ కేసు.. ఫ్లాట్ కొనుక్కునేందుకు రూ.4 కోట్లు ఇవ్వనందుకే సోనియా మాస్టర్ ప్లాన్!
- కంపెనీలోని రహస్య సమాచారాన్ని దొంగిలించిన సోనియా
- తొలుత రూ.30 కోట్లు డిమాండ్
- చివరికి పది కోట్లకు డీల్
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మను బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో ముగ్గురు ఉద్యోగులకు కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. విజయ్ శేఖర్ శర్మ ఫిర్యాదుతో సోమవారం నొయిడా పోలీసులు సీఈవో సెక్రటరీ సోనియా ధవన్ (32), ఆమె భర్త రూపక్ జైన్ (38), కంపెనీ ఉద్యోగి దేవేంద్ర కుమార్(30)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యక్తిగత డేటాను దొంగిలించిన వీరు దానిని బయటపెడతామని బెదిరించి బాస్‌ను బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ రహస్య వివరాలను బయటపెట్టకుండా ఉండాలంటే రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విజయ్ శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. తాజాగా పోలీసుల విచారణలో మరో విస్తుగొలిపే విషయం వెలుగుచూసింది. ఫ్లాట్ కొనుక్కునేందుకు తనకు రూ.4 కోట్లు ఇవ్వాల్సిందిగా సోనియా ధవన్ తన బాస్ శర్మను కోరింది. అందుకు ఆయన నిరాకరించడంతో బ్లాక్‌మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నట్టు పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టపోయి ప్రస్తుతం ఖాళీగా ఉన్న భర్తతో కలిసి కుట్రకు తెరలేపింది.
సెప్టెంబరు 20న శర్మకు ఫోన్ చేసిన సోనియా రూ.30 కోట్లు డిమాండ్ చేసింది. ఆ తర్వాత దానిని రూ.20 కోట్లకు తగ్గించింది. చివరికి రూ.10 కోట్లకు డీల్ సెటిల్ చేసుకున్నట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) అజయ్ పాల్ శర్మ తెలిపారు. అందులో భాగంగా తొలి ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.2.67 లక్షలను ఆమెకు ఇచ్చిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు.