Tamilnadu: పెళ్లి చూపులకు వెళుతున్న ఆనందం నిమిషాల్లో ఆవిరి.. నిలువెల్లా మోసపోయిన 'పెళ్లికాని ప్రసాద్'!
- 43 ఏళ్లు వచ్చినా వివాహం కాని కాళీచరణ్
- మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో ప్రొఫెల్
- పరిచయమైన యువతి
- కానుకలు తీసుకెళ్లగా, పోలీసులమంటూ వచ్చి బురిడీ
నాలుగు పదుల వయసుదాటినా 'పెళ్లికాని ప్రసాద్'గా మిగిలిపోయిన ఓ వ్యక్తి, ఎట్టకేలకు పెళ్లి చూపులకు వెళుతున్నానని పడ్డ సంబరం నిమిషాల్లో ఆవిరైంది. అతన్ని ఓ యువతి మాయమాటలతో నిలువెల్లా ముంచేసింది.
చెన్నైలో జరిగిన ఈ ఘటన వెనుక పూర్వాపరాల్లోకి వెళితే, ఆరంబాక్కం ప్రాంతానికి చెందిన కాళీ చరణ్ కు 43 సంవత్సరాలు. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న అతనికి ఎన్నో ఏళ్లుగా సంబంధాలు చూస్తున్నా, సరైన వధువు దొరకలేదు. ఈ క్రమంలో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో తన పేరు నమోదు చేసుకుని, ఓ అమ్మాయి ఫొటోను చూసి ముచ్చటపడ్డాడు.
ఆ అమ్మాయి కూడా అంగీకరించడంతో ఆనందపడిపోయాడు. తాను నేరుగా కలుస్తానని చెప్పిన ఆ యువతి, చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ కు రావాలని అతన్ని ఆహ్వానించింది. కొత్త బట్టలు, రెండున్నర సవర్ల బంగారు గొలుసు, అర సవర ఉంగరం ఆమెకు కానుకలుగా కొనుగోలు చేసిన కాళీ చరణ్, వాటిని తీసుకుని సదరు షాపింగ్ మాల్ వద్దకు బయలుదేరాడు. ఈలోగా మరోసారి ఫోన్ చేసిన ఆమె, తాను సంగం థియేటర్ వద్ద ఉన్నానని, అక్కడికి రావాలని చెప్పింది. అక్కడికి వెళుతుండగా, పొన్నమ్మాళ్ వీధిలోని ప్రైవేటు గెస్ట్ హౌస్ కు రావాలని కోరింది.
ఆమె చెప్పినట్టే అతను వెళ్లగా, కిందే ఎదురైన ఓ మహిళ, కాళీ చరణ్ ను మేడపైకి తీసుకెళ్లింది. ఆ వెంటనే ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి, తాము పోలీసులమని, నీపై 'మీటూ' ఫిర్యాదులు ఉన్నాయని బెదిరించారు. ఇంటికి వస్తే పరువు పోతుందని, ఇక్కడికి పిలిపించామంటూ, అతని వద్ద ఉన్న బంగారం, డబ్బు లాక్కున్నారు. ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్ ను అడిగి చెప్పించుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన తరువాత, తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు, పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.