cbi: అనూహ్య పరిణామాల నేపథ్యంలో 'డైరెక్టర్'ల పదవులపై కీలక ప్రకటన చేసిన సీబీఐ!
- అవినీతి ఆరోపణలను సీవీసీ పరిశీలించేంత వరకే తాత్కాలిక డైరెక్టర్ విధులు
- అనంతరం డైరెక్టర్ గా అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ గా అస్థానా కొనసాగింపు
- అలోక్ వర్మ పిటీషన్ పై రేపు సుప్రీంలో విచారణ
అంతర్గత కుమ్ములాటలు, అనూహ్య పరిణామాల నేపథ్యంలో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం మరో కీలకమైన ప్రకటన చేసింది. అవినీతి ఆరోపణలపై సీవీసీ విచారణ పూర్తి చేసే వరకూ ఎం.నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్ విధులు కొనసాగిస్తారని, అనంతరం సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానా కొనసాగనున్నారని సీబీఐ అధికార ప్రతినిధి గురువారం ప్రకటించారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావు నియామకం నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
ఇదిలావుండగా, సీబీఐ డైరెక్టర్ స్థానం నుంచి తనను తొలగించడం నిబంధనలకు విరుద్ధమని అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం విచారణ జరపనుంది. అయితే కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అరుణ్ జైట్లీ సమర్థించారు. సీబీఐ సమగ్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.