Vijayawada: స్వామీ... నదికిపోయే దారేది?: విజయవాడలో అగచాట్లు
- దుర్గాఘాట్ లో ఇబ్బంది కలిగించే పరిసరాలు
- దసరా తరువాత పట్టించుకోని అధికారులు
- స్పందించాలని డిమాండ్ చేస్తున్న భక్తులు
అడుగు పెడితే జారిపోయే మెట్లు, స్నానం చేద్దామంటే కంపుకొట్టే నీళ్లు. పవిత్రమైన కృష్ణా నదిలో స్నానం చేద్దామని విజయవాడ దుర్గాఘాట్ కు వస్తున్న భక్తులకు ఎదురవుతున్న పరిస్థితి ఇది. స్వామీ... నదికిపోయే దారేది? అని ఆ దుర్గా మల్లేశ్వరుడిని ప్రశ్నిస్తూ, అదే మురికి నీటిలో ముక్కు మూసుకుని మునగడం మినహా మరేమీ చేయలేని దుస్థితి భక్తులది. కనీసం నదికి నమస్కరించి వెళదామన్నా ఇబ్బంది కలిగించే పరిసరాలే కనిపిస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. బట్టలు మార్చుకోవాలన్నా కనీస సౌకర్యాల కరవు.
దుర్గగుడి అధికారుల ఉదాసీనత, ఇతర శాఖల అధికారులతో సమన్వయం లేని కారణంగానే అమ్మవారి భక్తులకు అవస్థలు తప్పడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. నిత్యమూ వేలాది మంది అమ్మను దర్శించుకునేందుకు వస్తుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అదే శుక్రవారమైనా, ఆదివారమైనా భక్తుల సంఖ్య రెట్టింపవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పాటు, నగరంలోని భక్తులు కూడా కృష్ణానదిలో స్నానం చేసి, ఇంద్రకీలాద్రి చేరుకోవాలనే భావిస్తుంటారు.
దుర్గాఘాట్ లో పారిశుద్ధ్య సమస్య తీవ్రరూపం దాల్చడం భక్తులను ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత, పారిశుద్ధ్యాన్ని పట్టించుకున్నవారు లేకపోవడంతో, అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. మెట్ల వద్ద, నదిలో వేసిన పూజాద్రవ్యాలను తొలగించను కూడా లేదు. నీటి ప్రవాహం లేకపోవడంతో, బురద, మురికి పెరిగిపోయి, ఘాట్ల వద్ద కృష్ణ నీరు దుర్గంధంగా మారింది. ఇక్కడ స్నానాలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.