Srinivasa Rao: జగన్ పై దాడి తరువాత, నాకేమైనా జరిగితే అవయవదానం చేయండి: లేఖలో శ్రీనివాసరావు
- శ్రీనివాసరావు జేబులో సుదీర్ఘ లేఖ
- ప్రభుత్వంపై విమర్శలు చేసిన దాడి నిందితుడు
- మీడియాకు లేఖను విడుదల చేసిన పోలీసులు
వైజాగ్ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై దాడికి దిగిన శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన తరువాత, అతని వద్ద నుంచి 11 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్న అధికారులు, దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖలోని దస్తూరి, 10వ తరగతి చదువుకున్న యువకుడు, 11 పేజీల సుదీర్ఘ లేఖను ఒకే విధంగా రాయడం వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నా, ఆ లేఖలో శ్రీనివాసరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఘటన తరువాత తనకేదైనా ప్రాణహాని జరిగితే, తన అవయవాలను దానం చేయాలని తన తల్లిదండ్రులకు విన్నవించుకున్నాడు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకెంతో అభిమానమని, చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని చెప్పుకొచ్చాడు. జగన్ అధికారంలోకి వస్తే, అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించాడు. ఒకసారి లబ్ధి పొందిన వారే, మళ్లీ మళ్లీ లబ్ది పొందుతున్నారని ఆరోపించాడు. పేదలకు ఏ విధమైన పథకాలూ అందడం లేదని ఆరోపించాడు. చివరిలో శ్రీనివాసరావు తన సంతకాన్ని కూడా చేయగా, సీఐఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ సంతకాలతో లేఖను అధికారులు ధ్రువీకరించారు.