Umesh Yadav: షమీ చేసిన తప్పేంటి? ఉమేశ్ యాదవ్ చేసిన గొప్పేంటి?: సెలక్టర్లపై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్
- తొలి రెండు వన్డేల్లో ఇద్దరి ప్రదర్శన అంతంత మాత్రమే
- ఉమేశ్‌ను కొనసాగించి, షమీని పక్కనపెట్టడంపై విమర్శలు
- సమాధానం చెప్పాలంటున్న అభిమానులు
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరగనున్న చివరి మూడు మ్యాచ్‌లకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు తిరిగి జట్టులో చేరారు. మహమ్మద్ షమీని పక్కనపెట్టి ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
తొలి రెండు వన్డేల్లో షమీ మూడు వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతేకాదు, ఓ చెత్త రికార్డును కూడా ఉమేశ్ మూటగట్టుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సార్లు 70కిపైగా పరుగులు సమర్పించుకున్న రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉమేశ్‌ను కొనసాగించి షమీని తప్పించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షమీని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ఉమేశ్ యాదవ్ కంటే బాగా రాణిస్తున్న షమీని పక్కనపెట్టడం తమను ఆశ్చర్యపరిచిందని, ‘క్యా సెలక్షన్ హై’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని సంతోష పెట్టేందుకు ఉమేశ్ యాదవ్‌కు జట్టులో చోటిచ్చారంటూ మరో ట్విట్టర్ యూజర్ సెలక్టర్లను ప్రశ్నించాడు.