Police: పోలీసులకు పలు అనుమానాలు... శ్రీనివాసరావుపై ప్రశ్నల వర్షం!
- ఇప్పటికే పోలీసుల చేతిలో శ్రీనివాస్ కాల్ డేటా
- కత్తి ఎలా ఎయిర్ పోర్టులోకి తెచ్చావని ప్రశ్న
- జగన్ పై దాడికి ఎవరు ప్రోత్సహించారు?
- శ్రీనివాస్ నుంచి సమాధానాలు రాబడుతున్న పోలీసులు
వైజాగ్ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై దాడి చేసి, ఎయిర్ పోర్టు సెక్యూరిటీకి పట్టుబడి, ప్రస్తుతం ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో ఉన్న నిందితుడు శ్రీనివాసరావుపై ఉన్నతాధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే అతని కాల్ డేటాను సేకరించిన పోలీసులు, అందులో తరచూ ఫోన్ కాల్స్ వెళ్లిన నంబర్ల వివరాలు, గత రెండు నెలల పరిధిలో ఆయన మాట్లాడిన కాల్స్ గురించి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
ఏ ఉద్దేశంతో ఈ పని చేశావు? దీని వెనుక ఎవరున్నారు? ఇటీవల పెద్ద పార్టీ ఇచ్చావటగదా? దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎయిర్ పోర్టులో ఉద్యోగానికి ఎవరు రికమండ్ చేశారు? కత్తిని ఎలా విమానాశ్రయంలోకి తేగలిగావు? కత్తి తెచ్చిన రోజు సీఐఎస్ఎఫ్ పోలీసులు తనిఖీ చేయలేదా? వంటి ప్రశ్నలను అధికారులు సంధించినట్టు తెలుస్తోంది.
వీటితో పాటు, జగన్ పై దాడి చేస్తే, సానుభూతి వస్తుందని ఎలా అనుకున్నావు? ఆయన సీఎం అయితే బాగుంటుందని నీకు ఎవరైనా చెప్పారా? జగన్ పై దాడికి ఎవరు ప్రోత్సహించారు? తదితర ప్రశ్నలు అడిగి శ్రీనివాస్ నుంచి సమాధానాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది. నిందితుడి నేర చరిత్ర, కుటుంబ నేపథ్యం, స్నేహితులు, పరిచయస్తుల వివరాలను కూడా విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, శ్రీనివాస్ ను నేడు కోర్టు ముందు హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.