Chandrababu: అదే జరిగి ఉంటే నేను, డీజీపీ దోషులుగా నిలబడాల్సి వచ్చేది: పోలీసులపై చంద్రబాబు సీరియస్
- పెద్దదాడి జరిగుంటే పరిస్థితి ఏంటి?
- పోలీసుల స్పందన సరిగ్గా లేదు
- ఐబీ చీఫ్ పై చంద్రబాబు అసహనం
నిన్న జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన తరువాత, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పివుంటే, తాను, తనతో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్ దోషులుగా నిలబడివుండేవాళ్లమని ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతలపై చర్చిస్తున్న వేళ, జగన్ పై దాడి అంశం చర్చకు రాగా, చంద్రబాబు మాట్లాడారు. జగన్ పై కాస్తంత పెద్దదాడి జరిగి, ఆయన విశాఖలోని ఆసుపత్రికి వెళ్లకుండా, హైదరాబాద్ కే బయలుదేరి, ఆ గంటన్నర వ్యవధిలో జరగరానిది జరిగుంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు జగన్ పై దాడి జరుగగా, సాయంత్రం 4 గంటల వరకూ పోలీసుల స్పందన సరిగ్గా లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపైనా అసహనాన్ని వ్యక్తం చేశారు. దాడి ఘటన తరువాతి పరిణామాల్లో పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు నిందించారు. పోలీసులు విఫలమైతే చెడ్డపేరు తన ప్రభుత్వానికే వస్తుందన్న సంగతిని మరువరాదని హెచ్చరించారు.