jagan: నిందితుడు శ్రీనివాసరావు కోర్టుకు తరలింపు.. చివరి పేజీని జగన్ ను కలిసే ముందు రాశాడన్న కమిషనర్!
- ఎయిర్ పోర్ట్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలింపు
- ఒకే సిమ్ తో 9 ఫోన్లను వాడాడని తెలిపిన కమిషనర్ లడ్డా
- లేఖలోని 9 పేజీలను సోదరి విజయలక్ష్మితో రాయించాడు
వైసీపీ అధినేత జగన్ పై నిన్న కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును పోలీసులు కోర్టుకు తరలించారు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి అతడిని భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ లడ్డా మాట్లాడుతూ, కోడిపందెంలో వాడే కత్తిని శ్రీనివాసరావు దాడికి ఉపయోగించాడని తెలిపారు. దాడికి సంబంధించి పలు ఆధారాలను సేకరించామని చెప్పారు. జగన్ ను కలవడానికి శ్రీనివాస్ గతంలో కూడా ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిపారు. ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ యజమానికి కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు.
గత ఏడాది కాలంలో శ్రీనివాస్ ఒకే సిమ్ తో 9 ఫోన్లను వాడాడని లడ్డా చెప్పారు. 11 పేజీల లేఖపై శ్రీనివాసరావును ప్రశ్నించామని... 9 పేజీలను సోదరి వరసైన విజయలక్ష్మితో రాయించాడని, మరో పేజీని అదే రెస్టారెంట్ లో పని చేస్తున్న అటెండర్ రేవతిపతితో రాయించాడని... చివరి పేజీని జగన్ ను కలిసే ముందు హడావుడిగా రాశాడని చెప్పారు. రేవతిపతి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోలి వాసి అని తెలిపారు. జగన్ పై దాడికి ఉపయోగించిన కత్తి 8 సెంటీమీటర్ల పొడవు ఉందని చెప్పారు.