Arun Jaitly: సుప్రీం ఆదేశాలపై స్పందించిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ
- సుప్రీంకోర్టు ఆదేశాలు సానుకూల పరిణామం
- కేంద్రప్రభుత్వ నిర్ణయానికి సమర్థన
- కళంకితులు సీబీఐ అధికారులుగా ఉండకూడదు
అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సీబీఐ వ్యవహారంపై రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో రెండు వారాల్లో విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని సీవీసీని ఆదేశించింది. ఈ ఆదేశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. సుప్రీం ఆదేశాన్ని ‘అత్యున్నత సానుకూల పరిణామ’మని ఆయన వ్యాఖ్యానించారు. విచారణపై నమ్మకాన్ని కల్పించేందుకు రిటైర్డ్ జడ్జీని సుప్రీంకోర్టు నియమించిందన్నారు.
అలోక్ వర్మ, రాకేష్ అస్థానాను సెలవుపై పంపించిన కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. సీబీఐ సమగ్రత, పనితీరు మసకబారకూడదని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సీబీఐలోని ఉన్నతాధికారులు ఇద్దరూ ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారన్నారన్నారు. సీబీఐలోని అధికారులు, ముఖ్యంగా ఉన్నతస్థానంలో ఉన్న ఇద్దరూ కళంకితులుగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పరిణామాలు సీబీఐ ప్రతిష్ఠను దిగజార్చాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిజం ఏంటో తెలుసుకోవాలని దేశప్రజలు భావిస్తున్నారని జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసనలు, రాహుల్ అరెస్ట్‌పై స్పందించిన జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.