Jagan: జగన్ దాడి విషయంలో గవర్నర్ తీరు.. వ్యవస్థపై మళ్లీ చర్చ!
- జగన్‌పై దాడి విషయమై డీజీపీకి ఫోన్ చేసిన గవర్నర్
- గవర్నర్ వ్యవస్థ అనేది నామమాత్రమే
- ఏ ప్రభుత్వోద్యోగికి ఫోన్ చేసి ప్రశ్నించే అధికారం లేదు
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగినట్టు వార్తలు వచ్చిన వెంటనే గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి సరాసరి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక కోరారు. దీంతో ఈ విషయం సీరియస్ అయింది. ఈ క్రమంలో అసలు గవర్నర్‌కు ఉండే అధికారాలేంటి? ఏ ప్రభుత్వోద్యోగికైనా ఫోన్ చేసి ప్రశ్నించే, ఆదేశాలు జారీ చేసే అధికారం ఉందా? తదితర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో గవర్నర్ వ్యవస్థ అనేది నామమాత్రమే. ఆయన రాజ్‌భవన్‌కు మాత్రమే అధికారి.
ఆంధ్ర, తెలంగాణలో ఎన్నో ప్రకృతి విపత్తులు, ఘోర ప్రమాదాలు జరిగాయి. కానీ ఆయనెప్పుడూ ఏ అధికారికి ఫోన్ చేయకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క జగన్ విషయంలో మాత్రమే దాడి జరిగిన వెంటనే డీజీపీకి ఫోన్ చేయడంపై టీడీపీ అగ్రనేతలు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు నేరుగా గవర్నర్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. గవర్నర్ వ్యవస్థపైనే చర్చ జరగాలంటున్నారు. రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జాతీయ స్థాయి నేతలను కలిసి గవర్నర్ తీరును ఎండగట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.