Andhra Pradesh: కృష్ణా జిల్లాలో బోర్డు తిప్పేసిన మెడికల్ కోచింగ్ సంస్థ.. తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులు!
- 54 మంది విద్యార్థులకు కుచ్చుటోపి
- భారీగా ఫీజు వసూలు చేసి పరారీ
- కేసు నమోదు చేసిన పెనమలూరు పోలీసులు
ఎంబీబీఎస్ పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇస్తామని ఓ ప్రబుద్ధుడు ఓ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దీన్ని నమ్మి చేరిన విద్యార్థుల నుంచి భారీగా ఫీజులను వసూలు చేశాడు. చివరికి నగదు మొత్తం తీసుకుని పారిపోయాడు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లాకు చెందిన రమణారెడ్డి 3 నెలల క్రితం విజయవాడలో ‘నేషనల్ మెడికల్ అకాడమీ’ పేరిట కోచింగ్ సెంటర్ ను ప్రారంభించాడు. 9 నెలల శిక్షణ కోసం రూ.1.50 లక్షలను ఫీజుగా నిర్ణయించాడు. దీంతో 54 మంది విద్యార్థులు ఈ సంస్థలో చేరారు. ఓసారి నగదు సమకూరడంతో అతను రాత్రికిరాత్రే కోచింగ్ సెంటర్ ను మూసేసి పరారయ్యాడు. మరుసటి రోజు కోచింగ్ సెంటర్ కు వచ్చిన విద్యార్థులు మూసి ఉండటంతో నిర్వాహకుడైన రమణారెడ్డికి ఫోన్ చేశారు.
అయితే ఫోన్ కలవకపోవడంతో రెండు, మూడు రోజులు ఎదురుచూశారు. చివరికి తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.