RBI: కేంద్రానిది టీ-20, మాది టెస్ట్ మ్యాచ్: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
- గత ప్రభుత్వాల తీరుకు ఇప్పటి ఎన్డీయేకు ఎంతో తేడా
- దీర్ఘకాల వృద్ధి స్థానంలో తాత్కాలిక ప్రయోజనాలు కోరుకుంటోంది
- ఆర్బీఐతో ఆధిపత్య పోరు నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం
- ముంబైలో డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య
దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్బీఐపై గతంలోని కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుకు, ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఎంతో వ్యత్యాసం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే ఫలితాన్ని ఇచ్చే టీ-20 తరహా క్రికెట్ గేమ్ ను కోరుకుంటున్నదని, తాము మాత్రం దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో పెట్టుకుని, టెస్టు మ్యాచ్ తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రిజర్వ్ బ్యాంక్ అధికారాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారని, దీనివల్ల పనితీరుపై పెను ప్రభావం పడుతోందని ఆయన అన్నారు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏడీ షరాఫ్ స్మారకోపన్యాసాన్ని ఇచ్చిన ఆయన, ఎంత ఎక్కువ స్వతంత్రంగా ఆర్బీఐ వ్యవహరిస్తే, అంత మేలు దేశానికి కలుగుతుందని అభిప్రాయపడ్డ విరల్ ఆచార్య, ప్రస్తుత ప్రభుత్వం ఆర్బీఐకి సరైన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. అధికారాలపై కేంద్రం, ఆర్బీఐ మధ్య టగ్ ఆఫ్ వార్ సాగుతోందని, ఈ ఆధిపత్య పోరు దేశానికి నష్టమేనని తెలిపారు.